లడఖ్ లో చైనా దూకుడు... అజిత్ ధోవల్, బిపిన్ రావత్ లతో అత్యవసరంగా సమావేశమైన ప్రధాని మోదీ

26-05-2020 Tue 18:39
  • సరిహద్దుల్లో మరోసారి ఘర్షణ పూరిత వాతావరణం
  • కదలికల్లో తీవ్రత పెంచిన చైనా
  • చైనా వైఖరిని తీవ్రంగా పరిగణిస్తోన్న భారత్
PM Modi meets top brass of defence in the wake of China movement at Ladakh

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పటివి కావు. 2017లో డోక్లామ్ వద్ద ఘర్షణల తర్వాత లడఖ్ లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. లడఖ్ సమీపంలో చైనా భారీగా సైనికులను తరలిస్తుండడం, అక్కడి ఓ ఎయిర్ బేస్ ను మరింత విస్తరించడం భారత్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ, వాయుసేన, నేవీ చీఫ్ లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా లడఖ్ వద్ద చైనా దుందుడుకు వైఖరిపైనే చర్చించినట్టు తెలుస్తోంది.

మోదీ అంతకుముందు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. అటు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సైతం త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చీఫ్ లతో భేటీ కావడం సమస్య తీవ్రతను సూచిస్తోంది. ప్రభుత్వాధినేతలు వరుసగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తుండడంతో మొత్తానికి ఏదో జరుగుతోందన్న భావనలు ఢిల్లీ వర్గాల్లో కలుగుతున్నాయి.