మరో ఉచితం.. రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు!

26-05-2020 Tue 17:31
  • రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం
  • రైతుల పంటలో 30 శాతాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
  • రైతు భరోసా సెంటర్ల ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాం
Jagan announces free bores for farmers

ఏపీ రైతులకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ అందించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది చివరికల్లా గ్రామాల్లో జనతా బజార్లను ఏర్పాటు చేస్తామని... రైతులు పండించే పంటను జనతా బజార్లలో విక్రయిస్తామని తెలిపారు. రైతులు పండించే పంటలో 30 శాతాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు.

దళారీ వ్యవస్థను తొలగించేందుకు తీసుకొచ్చిన రైతు భరోసా సెంటర్ల ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని తెలిపారు. రైతు భరోసా సెంటర్లలో కియోస్క్ లు, ల్యాబ్ లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 'మన పాలన-మీ సూచన' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ ఈ విషయాలను వెల్లడించారు.

రైతులు, రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే తమ లక్ష్యమని జగన్ చెప్పారు. గిట్టుబాటు ధర లభించినప్పుడే రైతులకు లాభసాటిగా ఉంటుందని  తెలిపారు. రైతు భరోసా - పీఎం కిసాన్ ద్వారా రూ. 13,500 పంటసాయాన్ని అందిస్తున్నామని చెప్పారు. రైతులకు వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమల్లోకి  తీసుకొచ్చామని తెలిపారు. ఉచిత కరెంట్ ద్వారా రైతులకు రూ. 49 వేల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.