ప్రభుత్వం దివాళా తీసిందా?: భూముల అమ్మకాలపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

26-05-2020 Tue 16:48
  • ఆస్తులు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారా?
  • లాక్ డౌన్ సమయంలో వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?
  • మా ఉత్తర్వులకు లోబడి వేలం నిర్వహించాలి
AP High court serious comments on government

బిల్డ్ ఏపీ కింద భూముల అమ్మకాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ-వేలానికి సంబంధించి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఆస్తులు అమ్మడం ద్వారానే ప్రభుత్వాన్ని నడపడం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వం దివాళా తీసిందా? అని ప్రశ్నించింది. వేల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఏపీలో ప్రజలు ధనవంతులుగా, ప్రభుత్వం పేదరికంగా ఉన్నట్టు ఉందని వ్యాఖ్యానించింది.

ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో... ఇంత అర్జంటుగా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి తాము ఇచ్చే ఉత్తర్వులకు లోబడే వేలం నిర్వహించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. దీంతో, తదుపరి విచారణను మే 28వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.