మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

26-05-2020 Tue 16:41
  • కరోనా పరీక్షల అంశంలో సర్కారుపై హైకోర్టు అసంతృప్తి
  • ఎందుకు తక్కువ పరీక్షలు చేస్తున్నారని అడిగిన న్యాయస్థానం
  • జూన్ 4 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం
High Court dismisses Telangana government order that corona tests to corpses are not required

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది.

 లక్షణాలు లేని హైరిస్క్ వ్యక్తులకు ఎందుకు పరీక్షలు చేయడంలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే తక్కువ పరీక్షలు ఎందుకు చేస్తున్నారని అడిగింది. మార్చి 11 నుంచి ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. కరోనా పరీక్షలపై కేంద్రం రెండుసార్లు రాసిన లేఖలను కూడా సమర్పించాలని కోరింది. కరోనా కిట్లు వైద్య సిబ్బందిలో ఎంతమందికి ఇచ్చారో తెలపాలని, అన్ని వివరాలతో జూన్ 4 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.