స్పైడర్ మ్యాన్ అవ్వాలని సాలీడుతో కుట్టించుకుని ఆసుపత్రి పాలైన అన్నదమ్ములు!

26-05-2020 Tue 13:58
  • బొలీవియాలో ఘటన
  • ముగ్గురినీ కాటేసిన విషపూరిత సాలీడు
  • చచ్చిబతికిన సోదరులు
Three brothers hospitalized after trying to become Spider Man

స్పైడర్ మ్యాన్ సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎత్తైన భవంతులను చిటికెలో ఎక్కేస్తూ, జిగురు దారం సాయంతో గాల్లో విపరీతమైన వేగంతో దూసుకుపోయే స్పైడర్ మ్యాన్ పై సినిమాలు, కార్టూన్లు ఎన్నో వచ్చాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ స్పైడర్ మ్యాన్ సాహసాలను ఆస్వాదిస్తుంటారు. అయితే, బొలీవియా దేశంలోని ముగ్గురు అన్నదమ్ములు స్పైడర్ మ్యాన్ లా తయారవ్వాలనుకుని ఆసుపత్రిపాలయ్యారు. స్పైడర్ మ్యాన్ ను సినిమాలు, కామిక్ బుక్ లలో చూసి అతడిలాగే వీరోచిత కృత్యాలు చేయాలని చయాంటా పట్టణానికి చెందిన ఆ సోదరులు భావించారు. వారి వయసులు వరుసగా, 8, 10, 12.

మే 14వ తేదీన ఒక ప్రమాదకర బ్లాక్ విడో సాలీడును పట్టుకుని దాన్ని ఓ కర్రతో పొడిచారు. అది ప్రతిస్పందనగా కుట్టడం ప్రారంభించింది. అన్నదమ్ములు ముగ్గురూ వరుసగా దాంతో కుట్టించుకున్నారు. స్పైడర్ మ్యాన్ లక్షణాలు కనిపించలేదు సరికదా, కాసేపటికే కళ్లు తేలేయడం మొదలుపెట్టారు. దాంతో తల్లి ఆందోళనకు గురై వారిని ఆసుపత్రిలో చేర్చింది. అప్పటికే సాలీడు విషం శరీరం మొత్తం పాకడంతో వారి పరిస్థితి విషమించింది. దాంతో వారిని మరో ఆసుపత్రికి తరలించారు.

అక్కడ కూడా ప్రయోజనం కనిపించకపోవడంతో లాపాజ్ లోని చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు జ్వరం, వణుకు, ఒళ్లంతా చెమటలు పట్టడం, కండరాల నొప్పితో బాధపడుతున్నారు. లాపాజ్ ఆసుపత్రి వైద్యులు ఎంతో శ్రమించి వారిని ఆరోగ్యవంతుల్ని చేశారు. మరో వారం తర్వాత ఆ ముగ్గురు అన్నదమ్ములు డిశ్చార్జి కానున్నారు. దీనిపై బొలీవియా ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఎపిడెమాలజీ చీఫ్ వర్జీలియో పీట్రో మాట్లాడుతూ, సినిమాల్లో చూపించేదంతా నిజం కాదని పిల్లలు తెలుసుకోవాలని, ఈ ఘటన వారికో కనువిప్పు వంటిదని అభిప్రాయపడ్డారు.