హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎదురుదెబ్బ తిన్న ఎల్జీ పాలిమర్స్

26-05-2020 Tue 13:20
  • ప్లాంట్ మూసివేయాలన్న ఏపీ హైకోర్టు
  • ప్లాంట్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అనుమతించాల్న ఎల్జీ పాలిమర్స్
  • ఎన్జీటీ/హైకోర్టు విచారణలు పూర్తయ్యాకే తమ వద్దకు రావాలన్న సుప్రీం
LG Polymers files petition against AP High Court orders

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించరాదంటూ ఇటీవలే ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎల్జీ పాలిమర్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్లాంట్ మూసివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ కోరుతూ సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమర్స్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్లాంట్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ ఎల్జీ పాలిమర్స్ విజ్ఞప్తి చేసింది.

అంతేగాకుండా, గ్యాస్ లీక్ వ్యవహారంపై ఏడు కమిటీలు ఏర్పాటు చేశారని, ఏ కమిటీ ముందు హాజరవ్వాలో తమకు అర్థంకావడంలేదని ఎల్జీ పాలిమర్స్ అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించింది. దీనికి సుప్రీం ధర్మాసనం బదులిస్తూ, ఎన్జీటీ లేదా హైకోర్టు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాయని, ఆయా విచారణలు ముగిసిన తర్వాతే సుప్రీం కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. ఇక, ఈ పిటిషన్ పై తాము తదుపరి విచారణ చేపట్టలేమంటూ ఎల్జీ పాలిమర్స్ కు తేల్చి చెప్పింది.