లాక్ డౌన్ లో షూటింగ్ చేసిన ప్రముఖ నటుడు!

26-05-2020 Tue 12:49
  • లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన షూటింగులు 
  • లాక్ డౌన్ లో కెమెరా ముందుకొచ్చిన తొలినటుడు
  • ఆర్.బాల్కి దర్శకత్వంలో వాణిజ్య ప్రకటన షూట్
  • 'ఆయుష్మాన్ భారత్' ప్రచార చిత్రం
Akshay Kumar resumes shoot for Ayushman Bharath

కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో విధించిన లాక్ డౌన్ దేశంలో అన్ని రంగాల కార్య కలాపాలను స్తంభింపజేసింది. దీంతో సినిమా చిత్ర నిర్మాణం కూడా గత రెండు నెలలుగా ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఈ సమయంలో ఆర్టిస్టులంతా మేకప్ కు దూరమయ్యారు.

ఈ క్రమంలో దేశంలో తొలిసారిగా ఇప్పుడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చాడు. అయితే, ఇదేదో సినిమా షూటింగ్ కోసం మాత్రం కాదులెండి.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన 'ఆయుష్మాన్ భారత్' ప్రచారానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన షూట్ కోసం కెమెరా ముందుకొచ్చాడు!

ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కి దర్శకత్వంలో ఈ వాణిజ్య ప్రకటన చిత్రాన్ని తాజాగా ముంబైలోని కమలిస్తాన్ స్టూడియోలో చిత్రీకరించారు. సుమారు రెండు గంటల పాటు ఈ చిత్రీకరణ జరిగింది. ఇందుకోసం ముంబై పోలీస్ కమీషనర్ నుంచి అనుమతి తీసుకున్నారు. అలాగే షూటింగు ప్రదేశంలో భౌతిక దూరం పాటించడం వంటి అన్ని ముందు జాగ్రత్తలను తీసుకుని, ప్రభుత్వ నిబంధనలను పాటించారు. ఈ విధంగా కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో తొలిసారిగా షూటింగ్ చేసిన ఘనత అక్షయ్ కుమార్ కే దక్కింది!