కృష్ణా జిల్లాలో భారీగా పట్టుబడిన తెలంగాణ మద్యం

26-05-2020 Tue 12:27
  • తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో మద్యం కొనుగోళ్లు
  • జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన నలుగురు వ్యక్తులు
  • రెండు లక్షల విలువైన మద్యం స్వాధీనం
Krishna dist police seize Telangana liquor

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలుతున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రెండు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో కొందరు అక్రమార్కులు సరిహద్దులోని తెలంగాణ గ్రామాల్లో మద్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా ఏపీలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి తరలిస్తుండగా ఈ ఉదయం కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2 లక్షల విలువైన మద్యంతోపాటు మూడు బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.