ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు.. పండ్లు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు!

26-05-2020 Tue 11:48
  • ఆయుష్మాన్ ఖురానా సినిమా ‘డ్రీమ్‌గర్ల్’లో నటించిన సోలంకి
  • లాక్‌డౌన్ కారణంగా చుట్టుముట్టిన ఆర్థిక కష్టాలు
  • ఇంటి అద్దె కట్టలేక అవస్థలు
Actor Solanki Diwakar returns to selling fruits to earn living

ప్రజల తలరాతలను లాక్‌డౌన్ మార్చేస్తోంది. నిన్నమొన్నటి వరకు గొప్పగా బతికిన వాళ్లను రోడ్డున పడేస్తోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ బాలీవుడ్ నటుడు సోలంకి దివాకర్. ఆయుష్మాన్ ఖురానా సినిమా ‘డ్రీమ్‌గర్ల్’లో నటించి అలరించిన దివాకర్ లాక్‌డౌన్ కారణంగా పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వాటి నుంచి బయటపడేందుకు ఢిల్లీ మార్కెట్లో పండ్లు అమ్ముకుంటూ కనిపించాడు. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేకపోతున్నానని, నిత్యావసరాల కొనుగోలుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నట్టు దివాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కెందుకు పండ్లు అమ్ముకుంటున్నట్టు చెప్పాడు.

డ్రీమ్‌గర్ల్ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన సోలంకి.. రిషికపూర్ చివరి సినిమా ‘శర్మాజీ నంకిన్’లో నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా మూడుసార్లు వాయిదా పడగా, ఆ తర్వాత రిషికపూర్ మృతి చెందడంతో సినిమా దాదాపు ఆగిపోయినట్టే లెక్క. చేతికి అందిన ఓ మంచి అవకాశం చేజారిపోయిందని సోలింకి వాపోయాడు.