ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేస్తున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య: ఐవైఆర్ కృష్ణారావు

26-05-2020 Tue 09:36
  • అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు చేస్తోన్న ఆర్థిక సాయంపై అభ్యంతరాలు  
  • మతపరమైన గౌరవ వేతనానికి ప్రజాధనాన్ని ఉపయోగించొద్దు
  • అర్చకులు అందరూ ప్రభుత్వ అధీనంలో పని చేస్తున్నారు
  • వారికి సహాయం పెద్ద దేవాలయాల ఆదాయం నుంచి ఇవ్వచ్చు
iyr krishna rao criticises ap govt

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు చేస్తోన్న ఆర్థిక సాయంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

'మతపరమైన గౌరవ వేతనానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యను ప్రచారం చేసుకోవడానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం విడ్డూరం. లెక్కల్లో ఎక్కడో తేడా ఉంది. 34 వేల అర్చకులకు 30 వేల పాస్టర్లు ఉన్నారు' అని చెప్పారు.
 
'అర్చకులు అందరూ ప్రభుత్వ అధీనంలో పని చేస్తున్నారు. వారికి సహాయం పెద్ద దేవాలయాల ఆదాయం నుంచి ఇవ్వచ్చు. టీటీడీ గత ప్రభుత్వ హయాంలో అర్చక సంక్షేమానికి రూ.100 కోట్లు వాగ్దానం చేసి రూ.50 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.50 కోట్లు విడుదల చేసి ఇతర పెద్ద దేవాలయాల సహాయంతో అర్చకులను ఆదుకో వచ్చు' అని ట్వీట్ చేశారు.
 
'మిగిలిన మతాల వారికి ఆయా మత సంస్థల నుంచి సహాయం వచ్చే విధివిధానాలు ఏర్పాటు చేయవచ్చు. అది సరైన పద్ధతి. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య' అని ఐవైఆర్ కృష్ణారావు చెప్పారు.