కృష్ణా జిల్లాలో దారుణం.. ప్రేమికుడిపై ప్రియురాలి దాడి!

26-05-2020 Tue 08:13
  • గత కొంతకాలంగా సహజీవనం
  • పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడిపై ఒత్తిడి
  • నిరాకరించడంతో కత్తితో దాడి
Girl Attacked lover in Krishna dist

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్నా పెళ్లి చేసుకునేందుకు అంగీకరించని ప్రియుడిపై ప్రియురాలు కత్తితో దాడి చేసింది. ఆపై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. మచిలీపట్నం ఇంగ్లిష్‌పాలేనికి చెందిన యువతి మచిలీపట్నంలోని ఓ కాలేజీలో పనిచేస్తోంది. గూడూరుకు చెందిన యువకుడు పెడన తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉండగా, ఇటీవల వక్కలగడ్డ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.

ఈ క్రమంలో నిన్న సాయంత్రం  యువతీయువకులు ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉన్నారు. యువకుడి శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతీయువకులు ఇద్దరినీ వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు.

ఆసుపత్రిలో యువకుడు మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలంటూ ఆమె గత కొన్నాళ్లుగా తనను ఒత్తిడి చేస్తోందన్నాడు. మాట్లాడుకుందామంటే గ్రామానికి వచ్చానని, పెళ్లి చేసుకుని కలిసి బతుకుదామని, లేదంటే కలిసి చనిపోదామని చెబుతూ తనపై కత్తితో దాడిచేసిందని వివరించాడు. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు మింగిందని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి స్పృహలోకి వస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.