విశాఖను వదలని కరోనా.. ఒక్క రోజే 10 మందికి సోకిన వైరస్

26-05-2020 Tue 07:36
  • నగరంలో ఇప్పటి వరకు 99 కేసులు నమోదు
  • ఇరువాడ పంచాయతీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా
  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,896 కేసుల నమోదు
Corona Cases in Visakhapatnam raised to 99

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుంటే, మరోవైపు విశాఖ వాసులను ఈ మహమ్మారి బెంబేలెత్తిస్తోంది. నిన్న ఒక్క రోజే నగరంలో 10 కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 99కి పెరిగింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశాల నుంచి నగరానికి చేరుకున్న వారిలో ఐదుగురు కరోనా బారినపడగా, అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని చిట్టిబోయినపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్ సంక్రమించింది.

కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 44 మంది కాగా, విదేశాల నుంచి నగరానికి చేరుకున్న వారు 45 మంది ఉన్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,896కు చేరింది. అలాగే, ఇప్పటి వరకు 56 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.