ఇది ముమ్మాటికీ దాతల మనోభావాలు దెబ్బతీయడమే: టీటీడీ ఆస్తుల విక్రయంపై వైసీపీ ఎంపీ వ్యాఖ్యలు

25-05-2020 Mon 20:30
  • టీటీడీ నిర్ణయం పట్ల రఘురామ కృష్ణంరాజు అభ్యంతరం
  • భక్తితో ఇచ్చిన ఆస్తులను పరిరక్షించాలని హితవు
  • సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడి
MP Raghurama Krishnamraju objects TTD decision of assets auction

దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల వెంకన్న ఆస్తులను విక్రయించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం పట్ల వైసీపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీటీడీ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేయకుండా, మళ్లీ అవే తప్పులు చేయాలని టీటీడీ భావిస్తోందని విమర్శించారు.

దేవుడి పేరిట ఉన్న ఆస్తులను అమ్మడం ద్వారా ఆ దేవుడికి టీటీడీ ద్రోహం చేస్తోందని అన్నారు. టీటీడీ తన నిర్ణయం ద్వారా.... భూములు విరాళంగా ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దాతలు ఎంతో భక్తితో ఆస్తులు సమర్పిస్తారని, ఆ ఆస్తులను పరిరక్షించాలే కానీ, విక్రయించడం సబబు కాదని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు. ఈ అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు.