9 కాదు 10 హత్యలని తేల్చిన పోలీసులు... గొర్రెకుంట బావి ఘటనలో నిందితుడి గురించి దిగ్భ్రాంతికర వాస్తవాలు!

25-05-2020 Mon 15:47
  • రెండు నెలల క్రితం ఓ మహిళను చంపిన సంజయ్
  • నిలదీసినందుకే మక్సూద్ కుటుంబీకుల హత్య
  • ఎలా చంపాలో ఇంటర్నెట్లో సెర్చ్
Police knew the accused did ten murders in Gorrekunta issue

వరంగల్ శివారు గీసుకొండ ప్రాంతంలోని గొర్రెకుంట బావిలో ఏకంగా 9 మృతదేహాలు లభ్యం కావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు సంజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. మక్సూద్ కుటుంబంతో పాటు బీహార్ కార్మికులు కూడా హత్యకు గురయ్యారు.

 నిందితుడు సంజయ్ కొన్నినెలల క్రితం మక్సూద్ కుటుంబానికి చెందిన మహిళను కోల్ కతా వెళదామని చెప్పి, తీసుకెళ్లి నిడదవోలు సమీపంలో రైలు నుంచి తోసేసి అంతమొందించాడు. ఈ విషయంలో తనను మక్సూద్ కుటుంబం నిలదీయడంతో, వారు హత్య విషయాన్ని ఎక్కడ పోలీసులకు చెప్పేస్తారోనన్న అనుమానంతో, పథకం ప్రకారం వారిని కూడా హతమార్చాడు.

కూల్ డ్రింకులో నిద్ర మాత్రలు కలిపి వారు స్పృహ కోల్పోయాక గోనె సంచిలో కుక్కి ఒక్కొక్కరిని బావిలో పడేశాడు. కేవలం ఒక హత్య మరో 9 హత్యలకు దారితీసిందన్న భయంకర వాస్తవం పోలీసులను సైతం నివ్వెరపరిచింది. బీహార్ కు చెందిన సంజయ్ ఇంటర్నెట్ లో వెతికి మరీ మర్డర్ ప్లాన్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.