Bhanuprakash Reddy: శ్రీవారి ఆస్తుల అమ్మకంపై టీటీడీ బోర్డులో ఓటింగ్ చేపట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

  • ఈ నెల 28న టీటీడీ పాలకమండలి సమావేశం
  • దమ్ముంటే ఓటింగ్ చేపట్టాలన్న భానుప్రకాశ్ రెడ్డి
  • ఆస్తుల అమ్మకాన్ని బోర్డులో సగం మంది వ్యతిరేకిస్తున్నట్టు వెల్లడి
Bhanuprakash Reddy demands voting in TTD board meeting

దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆస్తుల అమ్మకానికి టీటీడీ సిద్ధం కావడం విపక్షాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. దీనిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి స్పందించారు. శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంపై టీటీడీ బోర్డులో ఓటింగ్ చేపట్టి, తద్వారా చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ సభ్యులే బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు రాకేశ్ సిన్హా లేఖ రాసిన అంశాన్ని ప్రస్తావించారు. టీటీడీ బోర్డులో సగం మంది సభ్యులు ఆస్తుల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.

విపక్షంలో ఉన్నప్పుడు దేవాదాయ భూములు అమ్మరాదని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి, ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. ఆస్తుల అమ్మకాలపై టీటీడీకి హక్కులు లేకుండా పకడ్బందీగా చట్టం చేయాలని సూచించారు. ఈ ప్రభుత్వంపైనా, ప్రభుత్వ పెద్దలపైనా హిందువులకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఈ నెల 28న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఆస్తుల అమ్మకంపై ఓటింగ్ నిర్వహించాలని సవాల్ విసిరారు.

More Telugu News