మాస్క్‌తో పోయేదాన్ని సీబీఐ దాకా తెచ్చిన వారి గొప్పతనాన్ని అభినందించక తప్పదు: వర్ల రామయ్య

25-05-2020 Mon 12:54
  • సస్పెన్షన్‌ వేటు పడిన ప్రభుత్వ డాక్టర్‌ సుధాకర్ కేసుపై స్పందన
  • జగన్ సలహాదారులపై వర్ల చురక
  • కోట్లాది రూపాయల జీతం పొందుతున్నారని వ్యాఖ్య
  • వారి సేవలకు జోహార్లు అంటూ ఎద్దేవా
varla ramaiah fires on ycp leaders

వైద్య సిబ్బందికి మాస్కులు ఇవ్వట్లేదని ఆరోపించి, సస్పెన్షన్ కు గురైన ప్రభుత్వ డాక్టర్‌ సుధాకర్‌ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. సుధాకర్‌ ఒక మానసిక రోగి అని ఏపీ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. దీనిపై స్పందించిన టీడీపీ నేత వర్ల రామయ్య మాస్కుతో పోయేదాన్ని సీబీఐ దాకా తెచ్చుకున్నారంటూ చురకలంటించారు.

'ముఖ్యమంత్రి గారు.. ఒక్క "మాస్క్" తో పోయే దానిని "సీబీఐ" దాకా తెచ్చిన మీ సలహాదారుల గొప్పతనాన్ని అభినందించక తప్పడంలేదు. కోట్లాది రూపాయల జీతం పొందుతూ మీకు, ప్రభుత్వానికి వారు అందిస్తున్న సేవలకు మా జోహార్లు. ఇంతటి "ఘనాపాటీ"ల సేవలు భవిష్యత్ ప్రభుత్వం భరించలేదు' అని వర్ల రామయ్య ట్వీట్ చేశారు.