Hyderabad: వైద్యురాలి ఫోన్‌కు అసభ్య సందేశాలు.. హోంగార్డుపై వేటేసిన హైదరాబాద్ సీపీ

  • విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వైద్యురాలిని ఆపిన హోంగార్డు
  • వ్యక్తిగత వివరాలతోపాటు ఫోన్ నంబర్ సేకరణ
  • నాటి నుంచి ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపిస్తూ వేధింపులు
CP Anjani Kumar Suspended Home Guard

వైద్యురాలి ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపిస్తూ వేధిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వేటేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పౌరులకు రక్షణ కల్పించడమే కాకుండా వారిని గౌరవించాల్సిన బాధ్యత కూడా పోలీసులదేనని పేర్కొన్నారు.

ఇంతకీ ఏం జరిగిందటే.. సుల్తాన్ బజార్‌లోని ప్రసూతి ఆసుపత్రిలో శిక్షణలో ఉన్న ఓ వైద్యురాలు వారం రోజుల క్రితం డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ముషీరాబాద్ చెక్‌పోస్టు వద్ద ఆమెను అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డు వెంకటేశ్ ఆమె వ్యక్తిగత వివరాలతోపాటు ఫోన్ నంబరు కూడా తీసుకున్నాడు.

అప్పటి నుంచి ఆమె మొబైల్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తూ వేధించడం మొదలుపెట్టాడు. వెంకటేశ్ నుంచి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో భరించలేని వైద్యురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హోంగార్డు వెంకటేశ్‌పై వేటేశారు.

More Telugu News