ramzan: నేడు రంజాన్.. హైదరాబాద్‌లో 112 ఏళ్ల తర్వాత ఇళ్లలోనే ప్రార్థనలు!

  • 1908లో హైదరాబాద్‌ను అస్తవ్యస్తం చేసిన మూసీ వరదలు
  • అప్పట్లో ఇళ్లకే పరిమితమైన రంజాన్ పండుగ
  • నాటి పరిస్థితులే నేడు
Muslims Celebrates Ramzan at Home

నేడు రంజాన్.. ముస్లింలకు పరమ పవిత్రమైన రోజు. అయితే, కరోనా నేపథ్యంలో వారు మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి. ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి. ఇళ్లలోనే ఎవరికి వారు ప్రార్థనలు చేసుకోవడం తప్ప ఇప్పుడు మరో మార్గం లేదు. అయితే, ఇలాంటి పరిస్థితే 112 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో వచ్చింది.

అప్పట్లో మూసీ వరదలు నగరాన్ని కబళించాయి. దీంతో నగరం మొత్తం బోసిపోయింది. అయితే, ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా ఎటువంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా ఎవరికి వారు ఇళ్లలోనే పండుగ చేసుకున్నారు. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ముస్లింలు ఎవరికి వారే ఈదుల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు.  

లాక్‌డౌన్ కారణంగా రంజాన్ మాసం నగరంలో కళ తప్పింది. అందరూ ఎంతో ఇష్టపడే హలీం ఈసారి మాయమైంది. షాపింగ్ లేక మార్కెట్లు కళ తప్పాయి. ఈ సీజన్‌లో ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు రూ. 500 కోట్ల వ్యాపారం సాగేది. లాక్‌డౌన్ నేపథ్యంలో వ్యాపారం దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాలు సహా నగరంలోని ప్రధాన మార్కెట్లన్నీ కళ తప్పాయి.

హైదరాబాద్‌లో రంజాన్ నెలలో 12 వేలకు పైగా హలీం బట్టీలు కనిపించేవి. ఈసారి ఒక్కటంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది. ఇక్కడి నుంచి హలీం విదేశాలకు కూడా ఎగుమతి అయ్యేది. ఇలా హలీం వల్ల నగరంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల కుటుంబాలు ఉపాధి పొందేవి.  

1908లో మూసీనదికి వచ్చిన వరదలు జనజీవనాన్ని కకావికలం చేస్తే ఇప్పుడు కమ్ముకొచ్చిన కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈ రెండు సందర్భాల్లోనూ ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లకే పరిమితం చేశారు. అప్పట్లో ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా ఇంటిలోనే ప్రార్థనలు చేసుకున్నారు. ఇప్పుడు అవి తెరుచుకోకపోవడంతో ఇంటిలోనే ఈదుల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు.

More Telugu News