గదిలో పడేసి బెల్టుతో బాదడం నాకు బాగా తెలుసు... అధికారులకు వార్నింగ్ ఇచ్చిన కేంద్రమంత్రిణి!

24-05-2020 Sun 21:53
  • చత్తీస్ గఢ్ లో ఘటన
  • క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలు బాగాలేవని ఓ వ్యక్తి ఆరోపణ
  • అతడిపై అధికారులు దాడి చేసినట్టు కేంద్రమంత్రికి సమాచారం
  • అధికారులను నిలదీసిన కేంద్రమంత్రి రేణుకా సింగ్
Union Minister of state Renuka Singh warns officials in quarantine center

కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్ వార్తల్లో కెక్కారు. బెల్టుతో బాదడం తనకు కొత్తేమీ కాదంటూ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వివరాల్లోకెళితే.... చత్తీస్ గఢ్ లోని బలరాంపూర్ జిల్లా దిలీప్ గుప్తా అనే వ్యక్తి క్వారంటైన్ కేంద్రంలో సదుపాయాలు బాగా లేవని ఫిర్యాదు చేశాడు. తాను ఫిర్యాదు చేశానన్న కోపంతో క్వారంటైన్ కేంద్రం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తహసీల్దార్ తనపై దాడి చేశారని దిలీప్ గుప్తా ఆరోపించాడు.

దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర సహాయమంత్రి రేణుకా సింగ్ క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. జరిగిన ఘటనపై దిలీప్ గుప్తా, అతని కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడి అధికారులపై మండిపడ్డారు. కాషాయం ధరించిన బీజేపీ కార్యకర్తలను బలహీనులుగా భావించవద్దని స్పష్టం చేశారు. గదిలో పడేసి బెల్టుతో బాదడం ఎలాగో నాకు బాగా తెలుసు అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. ఇకనైనా బీజేపీ కార్యకర్తల పట్ల మీరు చూపిస్తున్న వివక్షను విడనాడండి అంటూ గట్టిగా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది.