CDC: కరోనా ఎవరి నుంచి ఎవరికి సోకుతుందంటే...!

  • కరోనా వ్యాప్తిపై మరింత స్పష్టతనిచ్చిన సీడీసీ
  • మనుషుల నుంచి మనుషులకే ఎక్కువగా సోకుతుందని వెల్లడి
  • వెబ్ సైట్ లో సమాచారాన్ని నవీకరించిన సీడీసీ
CDC updates covid website with modified information

కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో కరోనా ఎలా వస్తుందన్నదానిపై భిన్న వాదనలు వినిపించాయి. తాజాగా అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ మేరకు 'How COVID-19 Spreads' (కొవిడ్-19 ఎలా వ్యాపిస్తుంది) అనే వెబ్ సైట్ లో సమాచారాన్ని అప్ డేట్ చేసింది. సవరించిన సమాచారం మేరకు... కరోనా వైరస్ మనుషుల మధ్యనే ఎక్కువగా వ్యాప్తి జరుగుతుందని వివరించింది.  మనుషుల్లోనే, మనుషుల మధ్యనే మనుగడ సాగిస్తుందని తెలిపింది.

అంతేకాదు, కరోనా కారకాలు ఏమిటి అనే ఆప్షన్ కింద సీడీసీ మరికొంత సమాచారం నవీకరించింది. పైన పేర్కొన్న విధంగా తప్ప మరే ఇతర మార్గాల్లోనూ ఏమంత సులభంగా కరోనా వ్యాప్తి చెందదు అని స్పష్టీకరించింది. వైరస్ సంక్రమణ ఉపరితలాలను తాకినా, వస్తువులను తాకినా కరోనా సోకదని, జంతువుల విషయంలోనూ ఇదే వర్తిస్తుందని సీడీసీ వివరించింది. దీనిపై సీడీసీ అధికార ప్రతినిధి క్రిస్టెన్ నోర్డ్ లండ్ మాట్లాడుతూ, మనిషితో మరో మనిషి సన్నిహితంగా మెలిగినందువల్లే కరోనా వస్తుంది అని స్పష్టం చేశారు.

మనిషి దగ్గినా, తుమ్మినా తుంపర్ల రూపంలోనే అధికంగా కరోనా క్రిములు ప్రయాణం చేస్తాయని సీడీసీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అయితే, వైరస్ ను ఇతరులకు వ్యాప్తి చేయడానికి ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడాల్సిన పనిలేదని, లక్షణాలు లేకుండా కూడా ఇతరులకు సంక్రమింప చేసే అవకాశముందని వెల్లడించారు. ఓ వ్యక్తికి ఆరు అడుగుల దూరం కంటే తక్కువగా ఉంటే సన్నిహితంగా మెలిగినట్టేనని సీడీసీ స్పష్టం చేసింది.

More Telugu News