Vaccine: భారత్ లో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు ముమ్మరం.. ఒకటి కాదు నాలుగు వస్తున్నాయి!

Centre says four corona vaccine candidates will be entered into clinical trial stage
  • ప్రపంచవ్యాప్తంగా 100 వ్యాక్సిన్లపై పరిశోధనలు
  • భారత్ లో 14 వ్యాక్సిన్లపై ప్రయోగాలు
  • వాటిలో 4 మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయన్న కేంద్రం
  • త్వరలోనే మనుషులపై ప్రయోగం
యావత్ ప్రపంచం ఇప్పుడు కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. అనేక దేశాల్లో వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 100 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో భారత్ కు చెందిన 14 కరోనా వ్యాక్సిన్లు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. వాటిలో 4 వ్యాక్సిన్లు మరింత మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని, త్వరలోనే వాటిని క్లినికల్ ట్రయల్స్ దశకు తీసుకెళుతున్నామని చెప్పారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఆ వ్యాక్సిన్లను వివిధ వయసులున్న మనుషులపై ప్రయోగిస్తారని, ఆపై వచ్చే ఫలితాల ఆధారంగా వాటి పురోగతి ఆధారపడి ఉంటుందని వివరించారు. రాబోయే ఐదు నెలల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ వచ్చేసరికి సుదీర్ఘ సమయం పడుతుందని హర్షవర్ధన్ తెలిపారు. ఓ వ్యాక్సిన్ అన్నివిధాలా సిద్ధం కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు. అప్పటికీ వ్యాక్సిన్ రాని నేపథ్యంలో... భౌతికదూరం, శానిటైజర్లు, ఫేస్ మాస్కులతో కరోనాను ఆమడదూరంలో ఉంచొచ్చని అన్నారు.
Vaccine
Corona Virus
India
Clinical Trials
Harshavardhan

More Telugu News