ఇన్నాళ్లకు సరైన సమయం వచ్చింది: రానా

24-05-2020 Sun 17:11
  • త్వరలోనే మిహీకా బజాజ్ తో రానా పెళ్లి
  • కరోనా పరిస్థితులను బట్టి తమ పెళ్లి వేడుకలు ఆధారపడి ఉంటాయని వెల్లడి
  • తన గురించి మిహీకాకు పూర్తిగా తెలుసన్న రానా
Rana says he thought this is right time to get married

టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే మిహీకా బజాజ్, రానా కుటుంబాల్లో రోకా వేడుక జరిగింది. ఈ సందర్భంగా రానా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పెళ్లి చేసుకోవడానికి ఇన్నాళ్లకు సరైన సమయం వచ్చిందని భావిస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున ప్రపంచవ్యాప్త పరిస్థితులను అనుసరించి తన పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలో, వద్దో నిర్ణయించుకుంటామని వివరించాడు.

మిహీకాతో తన పరిచయం గురించి చెబుతూ, తన గురించి ఆమెకు పూర్తిగా తెలుసని, ఆమెను కలిసిన క్షణమే ఆమెతో తన జీవితం ముడిపడినట్టుగా భావించానని వెల్లడించాడు. "ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత మిహీకాకు ఫోన్ చేశాను. నా వైపు నుంచి ఎంతో స్పష్టంగా ఉన్నాను. జీవితాన్ని ఆమెతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అంతకుమించి ఇంకేమీ ఆలోచించలేదు. ఆమె వ్యక్తిగతంగా కలవడంతో నా మనసులో ఉన్నది చెప్పేశాను" అని పేర్కొన్నాడు.