తెలంగాణ ప్రాజెక్టులు ఆపకపోతే ఏపీ జిల్లాలు బీడుగా మారతాయి: కేంద్రానికి ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య లేఖ

24-05-2020 Sun 14:59
  • తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు
  • కృష్ణా జలాల వాటాలపై భేదాభిప్రాయాలు
  • జోక్యం చేసుకోవాలంటూ కేంద్రాన్ని కోరిన ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య
Water disputes raised again between AP and Telangana

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల అంశం వివాదాస్పదమవుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండడంతో సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా కనిపించడంలేదు. తాజాగా ఈ అంశంలో ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య కేంద్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని, అవి పూర్తయితే ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు నీరందక బీడుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలవనరుల శాఖ అత్యున్నత మండలి, సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోకుండానే కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి, దిండి, మిషన్ భగీరథ, భక్త రామదాసు, తుమ్మిళ్ల వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ సాగునీటి సంఘాల సమాఖ్య తన లేఖలో ఆరోపించింది. శ్రీశైలం, సాగర్ లకు ఎగువన నిర్మితమవుతున్న ఈ డ్యామ్ లను ఆపి, దిగువ రాష్ట్రమైన ఏపీ రైతుల హక్కులను సంరక్షించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరింది.