Uttar Pradesh: రెండు సార్లు ఆగిన పెళ్లి... ఇక లాభం లేదంటూ 80 కిలోమీటర్లు నడిచిన వధువు!

  • లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా
  • వెంటనే పెళ్లి చేయాలంటూ వాదించిన వధువు
  • తల్లిదండ్రులు వద్దనడంతో నడుస్తూ అత్తారింటికి
  • ఉత్తర ప్రదేశ్ లో ఘటన
Bride Walks 60 kilo meters for Marriage

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా రెండు సార్లు వివాహం వాయిదా పడగా, మరోసారి కూడా అలాగే జరుగుతుందన్న భయంతో ఓ వధువు ఏకంగా 80 కిలోమీటర్లు నడిచి వరుడి ఇంటికి చేరింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, లక్షణ్ తిలక్ అనే గ్రామానికి చెందిన గోల్డీ అనే యువతికి భైసాపూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ తో పెళ్లి నిశ్చయమైంది. వీరి పెళ్లిని ఏప్రిల్ లో జరిపించాలని నిశ్చయించిన పెద్దలు, ఆపై లాక్ డౌన్ కారణంగా మే నెల 4కు వాయిదా వేశారు.

మేలో కూడా వివాహం జరిగే వీలు కుదరకపోవడంతో మరో మంచి ముహూర్తం చూద్దామని పెద్దలు భావించారు. అయితే, తనకు వెంటనే పెళ్లి చేయాలని, ఇక శుభ ముహూర్తాల కోసం వేచి చూడవద్దని వధువు తన తల్లిదండ్రులతో వాదించగా, వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె, ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి వరుడి గ్రామానికి చేరింది. 

తమ కుమార్తె కనిపించడం లేదని గోల్డీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సమయంలోనే, ఆమె కాబోయే అత్తగారింటికి చేరిందన్న సమాచారం అందింది. ఆపై పెళ్లిని అందరి సమక్షంలో ఘనంగా జరిపిస్తామని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో, సాదాసీదాగా పెళ్లి తంతును కానిచ్చేశారు. నడిచి వచ్చిన వధువుతో వీరేంద్ర కుమార్ వివాహం జరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని జిల్లా ఎస్పీ అమరేందర్ సింగ్ వెల్లడించారు. 

More Telugu News