WHO: హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాపై సమర్థంగా పనిచేస్తుందనడానికి ఆధారాల్లేవు: డబ్ల్యూహెచ్ఓ

  • భారత్ లో ముందు నిలిచిపోరాడుతున్న వారికి క్లోరోక్విన్ మాత్రలు
  • నివారణ ఔషధంగా వాడొచ్చంటున్న ఐసీఎంఆర్  
  • ముప్పు ఉందంటున్న హార్వర్డ్ పరిశోధకులు
WHO says no use with Hydroxychloroquine in corona treatment

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాలు భారత్ ఎగుమతి చేసే హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కరోనా నివారణలో ఇది అమోఘంగా పనిచేస్తుందని ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా, భారత్ లో కరోనాపై ముందు నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి క్లోరోక్విన్ మాత్రలు ఇస్తున్నారు. అయితే, ఈ క్లోరోక్విన్ మాత్రల వినియోగం, పనితీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పెదవి విరుస్తోంది.

విస్తృత స్థాయిలో పరీక్షలు చేసినప్పుడు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం కరోనాపై పనిచేస్తుందనడానికి ఏ ఆధారం లభ్యం కాలేదని డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ అన్నారు. ఏదేమైనా మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వైద్యుల పర్యవేక్షణలోనే అందించాలని, దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా దృష్టిలో ఉంచుకుని చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మాత్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్ పై గట్టి నమ్మకం ప్రదర్శిస్తోంది.

హైడ్రాక్సీ క్వోరోక్విన్ మాత్రలను ముందస్తుగా వేసుకోని వారితో పోల్చితే, వేసుకున్న వారిలో కరోనా ఇన్ఫెక్షన్ చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఏర్పడే అవకాశాలు కనిపించాయని ఐసీఎంఆర్ వివరించింది. అందుకే, ఈ మాత్రలను నివారణ ఔషధంగా వాడొచ్చని చెబుతున్నామని ఐసీఎంఆర్ పేర్కొంది.

కాగా, లాన్సెట్ అనే వైద్య రంగ పత్రికలో మాత్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై హెచ్చరికలు చేశారు. 14,888 మంది కరోనా రోగులపై హార్వర్డ్ మెడికల్ స్కూల్, జ్యూరిచ్ యూనివర్సిటీ హాస్పిటల్ పరిశోధకులు అధ్యయనం చేయగా, ఈ మాత్రల వాడకం వల్ల వారిలో ప్రాణాపాయ రేటు ఎక్కువగా కనిపించిందని, వారి హృదయ స్పందనలోనూ హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయని వివరించారు.

More Telugu News