USA: అమెరికాలో చదివిన విదేశీయులకే హెచ్1బీ వీసాల జారీలో తొలి ప్రాధాన్యత!

  • అమెరికా చట్టసభలో కీలకమైన బిల్లు
  • నిపుణత ఉన్నవారికే పెద్దపీట
  • ఔట్ సోర్సింగ్ కంపెనీలను కట్టడి చేసేందుకు ప్రతిపాదనలు
US eyes on reforms in visa system

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు హెచ్1బీ వీసా ఎంతో కీలకం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక హెచ్1బీ వీసాల జారీ అంశం అనేక పర్యాయాలు తెరపైకి వచ్చింది. తాజాగా, హెచ్1బీ, ఎల్1 వీసాల జారీ ప్రక్రియకు సంబంధించిన విధానాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఓ బిల్లు రూపొందించారు.

ఈ బిల్లు ప్రకారం, అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకే హెచ్1బీ వీసాల జారీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా అమెరికాలోని నాణ్యమైన విద్యను అభ్యసించిన చురుకైన విద్యార్థులు అమెరికాలోనే అధిక సంఖ్యలో సేవలు అందించేందుకు వీలుపడుతుందని భావిస్తున్నారు. ఈ బిల్లును అమెరికా చట్ట సభల్లో ప్రవేశపెట్టారు.

అంతేకాకుండా, అమెరికన్లకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలను హెచ్1బీ, ఎల్1 వీసాదారులతో భర్తీ చేయడంపై పూర్తిస్తాయి నిషేధం విధించే లక్ష్యంతోనూ ఈ బిల్లు రూపుదిద్దుకున్నట్టు తెలుస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం హెచ్1బీ, ఎల్1 వీసాలపై ఉద్యోగులను దిగుమతి చేసుకుని, పని పూర్తయిన తర్వాత వారిని సొంతదేశాలకు పంపుతున్న ఔట్ సోర్సింగ్ కంపెనీలపైనా ఉక్కుపాదం మోపాలని ఈ బిల్లులోనే మరో కీలక ప్రతిపాదన చేశారు.

More Telugu News