Hari Kishan: సుప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కన్నుమూత

Famous mimicry artist is no more
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరికిషన్
  • కెరీర్ లో 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన హరికిషన్
  • గంట వ్యవధిలో 100 గొంతుకలు అనుకరించిన రికార్డు
మిమిక్రీ రంగంలో ఎంతో కృషి చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హరికిషన్ మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. హరికిషన్ మృతి అటు మిమిక్రీ రంగంలోనే కాదు, సినీ పరిశ్రమలోనూ విషాదం నింపింది. ఆయన అనేక చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించి నటుడిగానూ అలరించారు.

హరికిషన్ ఎవరి గొంతునైనా ఇట్టే అనుకరిస్తారని ప్రతీతి. 70వ దశకంలో కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు 10 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 60 నిమిషాల వ్యవధిలో 100 మంది గొంతుకలను అనుకరించిన రికార్డు హరికిషన్ సొంతం.

ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. బాల్యం నుంచే ఇతరులను అనుకరించడం ద్వారా మిమిక్రీపై ఆసక్తి ప్రదర్శించేవారు. అగ్రశ్రేణి మిమిక్రీ ఆర్టిస్టు నేరేళ్ల వేణుమాధవ్ స్ఫూర్తిగా ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో కొన్నాళ్లపాటు హైదరాబాదులోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన హరికిషన్, కెరీర్ కోసం ఉద్యోగాన్ని వదులుకుని పూర్తిగా మిమిక్రీ కళా ప్రదర్శనలపైనే దృష్టి సారించారు.
Hari Kishan
Mimicry
Artist
Tollywood

More Telugu News