కరోనా నుంచి కోలుకున్న తర్వాత వేధించే మరో కొత్త సమస్య!

23-05-2020 Sat 09:49
  • కోలుకున్న యువతిలో ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’ సమస్య
  • సార్స్ కోవ్2 కారణంగానేనన్న వైద్యులు
  • ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ కారణంగా సమస్య
subacute thyroiditis problem may suffer after corona

కరోనా బారినపడి కోలుకున్న వారికి మెడనొప్పి వేధిస్తున్నట్టు ఇటలీలోని ‘యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ పీసా’ వైద్యులు గుర్తించారు. ఇలా మెడనొప్పి రావడాన్ని ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’గా వ్యవహరిస్తారని వైద్యులు పేర్కొన్నారు. కరోనాకు గురై ఆ తర్వాత కోలుకున్న ఓ యువతిలో వైద్యులు ఈ లక్షణాలను గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిన ఆమెను మెడనొప్పితోపాటు థైరాయిడ్ గ్రంథి వద్ద నొప్పి వేధించింది. దీనికి తోడు జ్వరం కూడా రావడంతో ఆమె మరోమారు ఆసుపత్రికి వెళ్లింది.

యువతిని పరీక్షించిన వైద్యులు ‘సబ్ ఆక్యూట్ థైరాయిడిటిస్’ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడిన వారిలో ఇలాంటి సమస్యలు సహజమని వైద్యులు తెలిపారు. వారు కోలుకున్నప్పటికీ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ కారణంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాధి కారకమైన సార్స్ కోవ్2 కారణంగా ఆమెకు ఈ సమస్య వచ్చి ఉంటుందని డాక్టర్ లట్రోఫా పేర్కొన్నారు.