ఆమెను చూసినప్పుడు తనే నా లవ్ అని అనిపించింది: మిహీకా గురించి వివరాలు వెల్లడించిన రానా

22-05-2020 Fri 20:40
  • మిహీకా నాకు ఎప్పటి నుంచో తెలుసు
  • లాక్ డౌన్ కు ముందు ప్రేమ పుట్టింది
  • ప్రేమిస్తున్నానని ఫోన్ చేసి చెప్పాను
I know Miheeka since a long time says Rana

మిహీకా బజాజ్ తన కాబోయే భార్య అంటూ సినీ నటుడు రానా సోషల్ మీడియా ద్వారా పరిచయం చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మిహీకాతో తన పరిచయం తదితర వివరాలను మంచు లక్ష్మి నిర్వహించిన లైవ్ షోలో ఈరోజు రానా వెల్లడించాడు.

తన పెద్ద చెల్లెలు అశ్రితకు మిహీకా క్లాస్ మేట్ అని రానా చెప్పాడు. మిహీకా తనకు ఎప్పటి నుంచో తెలుసని... అయితే లాక్ డౌన్ కు కొన్ని రోజుల ముందే తమ మధ్య ప్రేమ పుట్టిందని తెలిపాడు. ముంబైలో మిహీకాకు ఉన్న ఫ్రెండ్స్ తనకు కూడా స్నేహితులు కావడం... తమ మధ్య బంధం బలపడటానికి మరో కారణమని చెప్పాడు.

మిహీకా నార్త్ ఇండియన్ అని... అయితే చిన్నప్పటి నుంచి హైదరాబాదులోనే పెరిగిందని... జూబ్లీహిల్స్ లో వారి ఇల్లు ఉందని రానా తెలిపాడు. తాను ప్రేమిస్తున్నాననే విషయాన్ని ఫోన్ ద్వారా మిహీకాకు చెప్పానని... ఆ తర్వాత ఆమె తనను కలిసిందని... పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నారని... మిహీకా విషయం చెప్పగానే అందరూ సంతోషపడ్డారని తెలిపారు. ఇప్పుడు జరిగింది రోహా వేడుక అని... ఇది నార్త్ ఇండియన్స్ చేసుకుంటారని... త్వరలోనే తాము ఉంగరాలు మార్చుకుని, నిశ్చితార్థం చేసుకుంటామని చెప్పాడు.