డాక్టర్ సుధాకర్ పై దాడిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశం!

22-05-2020 Fri 13:27
  • డాక్టర్ సుధాకర్ పై వైజాగ్ పోలీసుల దాడి
  • కేసును ఈరోజు విచారించిన ఏపీ హైకోర్టు
  • పోలీసులపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశం
AP High Court orders CBI probe in police attack on doctor Sudhakar

డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆయన బట్టలు విప్పించి, చేతులు వెనక్కి కట్టి, దుర్భాషలాడుతూ, కొట్టారు. అంతేకాదు ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో... ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్ అంశం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు మండిపడ్డారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి.

పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.