Jamal Khashoggi: మా తండ్రి హంతకులను క్షమించేస్తున్నాం: సలా ఖషోగ్గి

we forgive who assasinated our father says Sala Khashoggi
  • అక్టోబర్ 2018లో ఖషోగ్గి హత్య
  • ఎంబసీలోనే దారుణంగా చంపేసిన నిందితులు
  • వారిని క్షమిస్తున్నట్టు ప్రకటించిన కుమారుడు సలా
తమ తండ్రిని దారుణంగా హత్య చేసిన వారిని క్షమించాలని నిర్ణయించుకున్నట్టు సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ కుమారుడు సలా ఖషోగ్గీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. "అమరుడైన జమాల్‌ ఖషోగ్గీ కుమారులమైన మేము, మా తండ్రిని హత్య చేసిన వారికి క్షమాభిక్ష పెడుతున్నాం" అని ట్వీట్ చేశారు. కాగా, అమెరికాతో పాటు సౌదీ పౌరసత్వం కూడా కలిగిన సలా, ప్రస్తుతం సౌదీలోనే ఉంటున్నారు. క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించుకున్న కారణాలపై మాత్రం సలా ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు.

కాగా, సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీరును విమర్శిస్తూ, వాషింగ్టన్ పోస్ట్ లో జమాల్ ఖషోగ్గీ వార్తలు రాసిన తరువాత, అక్టోబర్ 2018లో టర్కీ, ఇస్తాంబుల్ నగరంలోని సౌదీ ఎంబసీలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆపై మహ్మద్ బిన్ సల్మాన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. యూఎస్ సైతం ఈ కేసులో నిజాలను వెలికితీసేందుకు సీక్రెట్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దింపగా, రియాద్ నుంచి వచ్చిన 15 మంది అతన్ని హత్య చేశారని టర్కీ ప్రకటించింది.

ఆపై ప్రపంచవ్యాప్తంగా ఖషోగ్గీ మృతిపై నిరసనలు జరుగగా, హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించిన సౌదీ, ఐదుగురికి మరణశిక్షను, ముగ్గురికి 24 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఇదిలావుండగా, సౌదీ న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని సలా ప్రకటించడం గమనార్హం.
Jamal Khashoggi
Twitter
Sala

More Telugu News