జూన్ 13 వరకు ‘వందే భారత్ మిషన్ 2’ పొడిగింపు

22-05-2020 Fri 08:10
  • నేటితో ముగియనున్న రెండో విడత
  • జూన్ 13 తర్వాత మూడో దశ కూడా ఉంటుందన్న ప్రభుత్వం
  • ఇప్పటి వరకు 23,475 మంది రాక
23475 Indians repatriated in Vande Bharat Mission

కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన వందేభారత్ మిషన్ తొలి విడత విజయవంతం కాగా, ఈ నెల 16న ప్రారంభమైన రెండో విడత మిషన్ నేటితో ముగియనుంది. అయితే, దీనిని వచ్చే నెల 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. అలాగే, జూన్ 13 తర్వాత మూడో విడత కూడా ఉంటుందన్నారు.

ఇప్పటి వరకు 98 దేశాల నుంచి 2.59 లక్షల మంది భారతీయులు వెనక్కి వచ్చేందుకు నమోదు చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 23,475 మంది ఇప్పటికే భారత్ చేరుకున్నట్టు చెప్పారు. కాగా, పొడిగించిన రెండో విడతలో 47 దేశాల్లోని భారతీయులను 162 విమానాల ద్వారా వెనక్కి తీసుకురానున్నట్టు అనురాగ్ వివరించారు.