ఒడిశా, బెంగాల్, బంగ్లాదేశ్ లను కుదిపేసిన ఎంఫాన్... 84 మంది బలి!

21-05-2020 Thu 18:53
  • ఎంఫాన్ విలయం
  • పశ్చిమ బెంగాల్ లో 72 మంది బలి
  • బంగ్లాదేశ్ లో లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలిన వైనం
Amphan wreaked havoc in West Bengal and Bangladesh

బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై క్రమంగా బలపడుతూ పెను తుపానుగా మారిన ఎంఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. దశాబ్దకాలం తర్వాత బెంగాల్ పై అత్యధిక ప్రభావం చూపిన తుపానుగా నిలిచిపోయింది.

ఎంఫాన్ ధాటికి 84 మంది మరణించగా, వారిలో 72 మంది పశ్చిమ బెంగాల్ లోనే మరణించారు. ఈ ప్రచండ తుపాను బీభత్సాన్ని చవిచూసింది బెంగాల్ గ్రామీణ ప్రాంతాలే కాదు కోల్ కతా మహానగరం కూడా గజగజలాడిపోయింది. వేల సంఖ్యలో గృహాలు నేలమట్టం అయ్యాయి. భారీగా చెట్లు విరిగిపడ్డాయి. పంటల సంగతి చెప్పనక్కర్లేదు. ఒడిశా ఉత్తరప్రాంతంలోనూ ఇదే పరిస్థితి.

పోతూపోతూ బంగ్లాదేశ్ ను కూడా ఎంఫాన్ ఓ చూపుచూసింది. అక్కడ లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 10 మంది మరణించినట్టు తెలుస్తోంది. తమ జీవితకాలంలో ఇలాంటి తుపానును ఎప్పుడూ చూడలేదని బంగ్లా ప్రజలు చెబుతున్నారు. ఎంఫాన్ తుపాను కారణంగా సుమారు కోటి మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని, 5 లక్షల మంది ప్రజలు కట్టుబట్టలతో మిగిలుండొచ్చని బంగ్లాదేశ్ లోని ఐక్యరాజ్యసమితి విభాగం పేర్కొంది.