దారికి అడ్డొచ్చిన సింహాల గుంపు.. అంబులెన్సులోనే మహిళకు ప్రసవం!

21-05-2020 Thu 17:56
  • గుజరాత్ గిర్ సోమనాథ్ జిల్లాలో ఘటన
  • ఆసుపత్రికి వెళ్తుండగా అడ్డొచ్చిన సింహాలు
  • ముందుకు వెళ్లేందుకు వీలు కాని వైనం
Woman delivers baby in ambulance surrounded by lions in Gujarat

పురిటి నొప్పులతో ఉన్న గర్భిణి అంబులెన్సులో వెళ్తున్న సమయంలో సింహాల గుంపు అడ్డు రావడంతో.. చివరకు ఆమె అంబులెన్స్ లోనే బిడ్డకు జన్మనిచ్చింది. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గిర్ సోమనాథ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, నిండుగర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్ ఆమెను ఎక్కించుకుని ఆసుపత్రికి బయల్దేరింది.

అయితే మార్గమధ్యంలో నాలుగు సింహాలు రోడ్డుకు అడ్డు వచ్చాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అంబులెన్స్ ను అక్కడే ఆపేశారు. ఈలోగానే ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో.. అంబులెన్సులో ఉన్న ఎమర్జెన్సీ సిబ్బంది... ఆమెకు డెలివరీ చేశారు. 20 నిమిషాల తర్వాత సింహాల గుంపు నెమ్మదిగా అక్కడి నుంచి కదిలింది. ఆ తర్వాత తల్లీబిడ్డలను ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.