మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు: సీఐడీ విచారణ అనంతరం రంగనాయకమ్మ

21-05-2020 Thu 16:10
  • విచారణ అధికారులు ఇబ్బందులు పెట్టలేదు
  • గత ఫేస్ బుక్ పోస్టులపై ప్రశ్నించారు
  • నాతో పాటు మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు  
Case is registered on one more person says Ranganayakamma

వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన గుంటూరుకు చెందిన రంగనాయకమ్మను సీఐడీ అధికారులు  విచారించారు. కాసేపటి క్రితం విచారణ ముగిసింది. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, విచారణ సమయంలో అధికారులు తనను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. తనతో మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారని తెలిపారు. ఆయనను విచారించే సమయంలో కూడా తనను హాజరు కావాలని చెప్పారని అన్నారు.

తన గత ఫేస్ బుక్ పోస్టులపై కూడా అధికారులు ప్రశ్నించారని రంగనాయకమ్మ చెప్పారు. టీవీలు, పత్రికల్లో వచ్చిన దృశ్యాలను చూసిన తర్వాతే తాను స్పందించినట్టు విచారణలో చెప్పానని తెలిపారు. మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సీఐడీ అధికారులు చెప్పారని వెల్లడించారు.

మరోవైపు ఈ ఉదయం సీఐడీ కార్యాలయానికి ఆమెతో పాటు సీపీఐ నేత రామకృష్ణ తదితరులు కూడా వెళ్లారు. విచారణను మహిళా కానిస్టేబుళ్ల సమక్షంలో అధికారులు నిర్వహించారు.