కరోనా టెస్టులు తక్కువగా చేస్తున్నారంటూ తెలంగాణకు కేంద్రం లేఖ!

21-05-2020 Thu 15:51
  • టెస్టుల సంఖ్య దేశ సగటు కంటే తక్కువగా ఉంది
  • భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది 
  • కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖలో వెల్లడి 
Centre criticises Telangana on corona tests

తెలంగాణలో జరుగుతున్న కరోనా టెస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాయని... కానీ, తెలంగాణలో మాత్రం ఈ విషయంలో అలసత్వం కనిపిస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. ఇప్పటి వరకు కేవలం 21 వేల టెస్టులను మాత్రమే నిర్వహించారని విమర్శించింది. దేశ సగటు కంటే తక్కువ పరీక్షలను నిర్వహిస్తున్నారని వ్యాఖ్యానించింది.

కరోనా విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని... భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. కరోనాను కట్టడి చేయాలంటే ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలను నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ఈరోజు లేఖ రాశారు.