మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా పోలీసుల దాడి.. చచ్చిన శవంలా నటించిన 'పెరూ' మేయర్!

21-05-2020 Thu 15:15
  • పెరూ దేశంలో ఘటన
  • మాస్కు ధరించి శవపేటికలో పడుకున్న మేయర్
  • మేయర్ చచ్చు తెలివిని పసిగట్టిన పోలీసులు
Peru Mayor acts like dead as Police arrived

పెరూ దేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దక్షిణ పెరూలో టంటారా అనే ఓ చిన్న పట్టణానికి జేమీ రొనాల్డో ఉర్బినా టోరెస్ అనే వ్యక్తి మేయర్ గా వ్యవహరిస్తున్నాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి, తానే లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేశాడు. మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా పోలీసులు రావడంతో చచ్చిన శవంలా నటించడం విస్తుగొలుపుతోంది.

ఆ మేయర్ పై అధికార వర్గాల్లోనూ సదభిప్రాయం లేదు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఏనాడూ సమీక్ష జరపడంగానీ, అధికారులకు దిశానిర్దేశం చేయడంగానీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటికీ పరాకాష్ఠ లాంటిదే ఈ ఘటన. సోమవారం రాత్రి టోరెస్ తన మిత్రులతో కలిసి మద్యం తాగుతున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకతో కంగుతిన్న మేయర్ టోరెస్ పక్కనే ఉన్న ఓ శవపేటికలో దూరి చచ్చినవాడిలా పడుకున్నాడు. పైగా ఓ మాస్కు కూడా ధరించి శవంలా నటించాడు.

అతడి నాటకాన్ని పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ్నించి తరలించారు. జాతీయ స్థాయిలో విధించిన లాక్ డౌన్ నియమావళిని ఉల్లంఘించాడంటూ అతడిపై ఆరోపణలు మోపారు. పెరూలో జాతీయ స్థాయి లాక్ డౌన్ ప్రకటించి 66 రోజులు కాగా, లాక్ డౌన్ ప్రారంభమయ్యాక సదరు మేయర్ టంటారా పట్టణంలో ఉన్నది కేవలం 8 రోజులేనట. దాంతో స్థానికులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి మేయర్ తమకొద్దని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.