ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై 'ఎంఫాన్' విరుచుకుపడడం విచారకరం: చంద్రబాబు

21-05-2020 Thu 14:50
  • ఒడిశా, బెంగాల్ పై పంజా విసిరిన 'ఎంఫాన్'
  • ఎన్నో విలువైన ప్రాణాలు పోయాయన్న చంద్రబాబు
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Chandrababu responds after Amphan wreaked havoc in Odisha and West Bengal

బంగాళాఖాతంలో ఏర్పడిన 'ఎంఫాన్' తుపాను ప్రచండ రూపు దాల్చి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై పంజా విసరడం తెలిసిందే. నిన్న తీరం దాటిన ఈ తుపాను రెండు రాష్ట్రాలను వణికించింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 'ఎంఫాన్' తుపాను తీవ్ర బీభత్సం సృష్టించిందని, ఇంతటి విధ్వంసాన్ని చూడాల్సి రావడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఎన్నో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని తెలిపారు.

గతంలో 'హుద్ హుద్' తుపాను ఉత్తరాంధ్రపై విరుచుకుపడినప్పుడు ప్రజలు ఒకరికొకరు అండగా ఎంతో ఆత్మస్థైర్యంతో విపత్తును ఎదుర్కొన్నారని, జీవితాలు తల్లకిందులయ్యే పరిస్థితులు వచ్చినా నాటి ప్రభుత్వ ఆసరాతో త్వరితగతిన కోలుకున్నారని వివరించారు. ఇప్పుడు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా అదే రీతిన పుంజుకోవాలని ఆకాంక్షించారు. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో సాయం అందించడం ద్వారా కోలుకోగలమన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించే సందేశం పంపాలని సూచించారు.