కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కర్ణాటకలో ఎఫ్ఐఆర్ నమోదు

21-05-2020 Thu 14:30
  • పీఎం కేర్స్ ఫండ్ పై ఆరోపణలు చేశారంటూ ఓ న్యాయవాది ఫిర్యాదు
  • కాంగ్రెస్ అధినాయకత్వంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
FIR registered on Congress chief Sonia Gandhi

ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలపై కర్ణాటకలోని శివమొగ్గలో ఎఫ్ఐఆర్ నమోదైంది. పీఎం కేర్స్ ఫండ్ కు వస్తున్న విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయంటూ సోనియా, తదితరులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ట్వీట్లు చేస్తున్నారంటూ కేవీ ప్రవీణ్ కుమార్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ అధినాయకత్వం మే 11న పీఎం కేర్స్ ఫండ్ పై నిరాధారమైన ఆరోపణలు చేశారని, పీఎం కేర్స్ ఫండ్ కు వస్తున్న విరాళాలను ప్రజల కోసం ఖర్చు చేయకుండా, ప్రధాని విదేశీ యాత్రలకు ఖర్చు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆ న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోనియాపైనా, ఇతర కాంగ్రెస్ నేతలపైనా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.