Narendra Modi: పశ్చిమ బెంగాల్లో విలయం కనిపిస్తోంది: మోదీ

  • బెంగాల్ ను అతలాకుతలం చేసిన ఎంఫాన్
  • నిన్న సాయంత్రం తీరం దాటిన ప్రచండ తుపాను
  • బెంగాల్ ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామన్న ప్రధాని
PM Modi terms it devastation as cyclone Amphan hit Bengal

నిన్న సాయంత్రం తీరం దాటిన ఎంఫాన్ తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోయింది. గంటకు 150 కిలోమీటర్లు మించిన వేగంతో పెనుగాలులు వీస్తుండగా, ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా కురిసిన వర్షంతో బెంగాల్ లోని పలు ప్రాంతాలు తుపాను విధ్వంసానికి చిరునామాగా మారాయి.

దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పశ్చిమ బెంగాల్ లో ఎంఫాన్ తుపాను బీభత్సం తాలూకు దృశ్యాలను చూస్తున్నామని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యావత్ భారతదేశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు.

బెంగాల్ ప్రజలు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని, బెంగాల్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని, ఉన్నతాధికారులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నిరంతరం సమన్వయంతో వ్యవహరిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారని మోదీ వెల్లడించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.

More Telugu News