Chiranjeevi: ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా విన్నపం ఇదే: చిరంజీవి

  • మంత్రి తలసానితో సినీ ప్రముఖుల భేటీ
  • షూటింగుల ప్రారంభంపై చర్చ
  • సినీ కార్మికుల కోసం నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి విన్నపం
Chiranjeevi request to KCR

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశం చిరంజీవి నివాసంలో జరిగింది. భేటీ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, షూటింగులు ఎప్పటి నుంచి ప్రారంభం కావాలనే విషయంపై ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రావాలి అనే దానిపై సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాలకు లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తోందని అన్నారు. అయితే, సినీ రంగం భవిష్యత్తు ఏమిటనే సందేహం అందరిలో ఉందని చెప్పారు.

వాస్తవానికి షూటింగులను ప్రారంభించేందుకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని... అయితే కరోనా వ్యాప్తికి కారణం కాకూడదనే భావనతో, ప్రభుత్వ సహకారంతో షూటింగులు చేసుకోవాలనేది తమ అభిమతమని చెప్పారు. ఇది కేవలం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల కోసమో, లేదా షూటింగ్ మధ్యలో ఉన్న సినిమాల కోసమో తాము చేస్తున్న విన్నపం కాదని... షూటింగులు జరిగితే కానీ బతుకులు ముందుకు సాగని 14 వేల మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న విన్నపమని చెప్పారు. 14 వేల మందిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరుతున్నామని అన్నారు.

ఈ సమావేశానికి అక్కినేని నాగార్జున, దిల్ రాజు, రాజమౌళి, నాని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అల్లు అరవింద్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సి కల్యాణ్ తదితరులు హాజరయ్యారు.

More Telugu News