భార్యపై అనుమానం.. హోంగార్డు కుటుంబంపై విషప్రయోగం!

21-05-2020 Thu 13:14
  • ఢిల్లీలోని అలీపూర్ ఘటన
  • భార్యకు ఓ హోంగార్డుతో సంబంధం ఉందని అనుమానం
  • హోంగార్డు కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు భర్త ప్లాన్
Delhi man planned to kill another family

ఢిల్లీలోని అలీపూర్ లో ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో మరో కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు ప్రయత్నించాడు. అలీపూర్ కు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు ఓ హోంగార్డుతో వివాహేతర సంబంధం ఉందని భావించేవాడు. దాంతో ఆ హోంగార్డుపై ప్రతీకారం కోసం సినీ ఫక్కీలో ప్లాన్ చేశాడు. ప్రస్తుతం కరోనా కలకలం నెలకొని ఉన్న తరుణంలో ఇద్దరు మహిళలను ఆరోగ్య కార్యకర్తల్లా హోంగార్డు ఇంటికి పంపించాడు.

ఢిల్లీలో కరోనా ఎక్కువగా ఉండడంతో ఆ ఇద్దరు మహిళలు ప్రభుత్వం పంపిన ఆరోగ్య సిబ్బంది అయ్యుంటారని ఆ హోంగార్డు కుటుంబం నమ్మింది. ఆ నమ్మకంతోనే ఆ ఇద్దరు మహిళలు కరోనా మందు అంటూ విషం కలిపిన ద్రావణం ఇవ్వగా, మరో ఆలోచన లేకుండా ఆ హోంగార్డు కుటుంబ సభ్యులు గడగడా తాగేశారు.

 హోంగార్డు కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అది తాగిన కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. ఏదో తేడా జరిగిందని గుర్తించి వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇద్దరు మహిళలనూ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, వారు ప్రదీప్ ప్లాన్ గురించి చెప్పారు. దాంతో అతడ్ని కూడా అరెస్ట్ చేశారు.