ఉద్యోగం పోయి ఖాళీగా వున్న వ్యక్తిని వరించిన కోట్ల లాటరీ!

21-05-2020 Thu 11:47
  • న్యూజిలాండ్‌లో ఘటన
  • ఇంట్లోనే ఉంటోన్న వ్యక్తి
  • కంప్యూటర్‌ చూస్తుండగా లాటరీ తగిలిందని తెలిసిన వైనం
man got lottery prize

కరోనా విజృంభణ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయాడు ఓ వ్యక్తి. దీంతో పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన అతడు.. తర్వాత రూ. 46 కోట్లు లాటరీ తగిలిందని తెలుసుకుని ఎగిరి గంతులేశాడు. తనకు పట్టిన దురదృష్టం ఇంత త్వరగా వదలి అదృష్టంగా మెరుపు వేగంతో తలుపుతట్టడంతో అతడు అమితానందం వ్యక్తం చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే న్యూజిలాండ్‌లో ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు. దీంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. గతంలో లాటరీ టికెట్ కొన్నానన్న విషయం కూడా అతడికి గుర్తుకు రాలేదు. కంప్యూటర్‌ లో ఏదో చూస్తుండగా వెబ్‌సైట్‌లో లాటరీ ఫలితాలు కనిపించడంతో దాన్ని క్లిక్‌ చేశాడు. అందులో తాను కొన్న లాటరీ టికెట్‌కు 10.3 న్యూజిలాండ్‌ డాలర్స్ (  దాదాపు రూ.46 కోట్లు) వచ్చాయని తెలుసుకుని ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.

ఉద్యోగానికి వెళ్లిన తన భార్య ఇంటికి రాగానే లాటరీ తగిలిన విషయం చెప్పాడు. ఆ డబ్బుతో ఇల్లు కొంటామని, పిల్లలను బాగా చదివిస్తామని ఆమె మీడియాకు తెలిపింది.