బెంగళూరులో అంతుచిక్కని భారీ శబ్దాలపై వివరణ ఇచ్చిన భారత వాయుసేన!

21-05-2020 Thu 10:02
  • సూపర్ సానిక్ వేగంతో వాయుసేన విమానం ఎగిరింది
  • 80 కిలోమీటర్ల దూరం వరకూ శబ్దం వినిపించింది
  • యుద్ధ విమానాలను పరీక్షించామని వివరణ
IAF Clarity on Bengaluru BOOM Sounds

బెంగళూరు నగర వాసులను బుధవారం మధ్యాహ్నం బెంబేలెత్తించిన వింత శబ్దాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేయగా, ఆ శబ్దాలపై భారత వాయుసేన వివరణ ఇచ్చింది. ఆ శబ్దం సూపర్ సానిక్ విమానందని స్పష్టం చేసింది.

"భారత వాయుసేనకు చెందిన టెస్ట్ ఫ్లయిట్, సూపర్ సానిక్ వేగంతో ప్రయాణించింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి అది టేకాఫ్ తీసుకుని, నగర పరిధిలోని అనుమతించిన మార్గంలో ప్రయాణించింది. ఏఎస్టీఈ (ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్ మెంట్) కి చెందిన విమానం ప్రయాణిస్తుంటే ఈ శబ్దాలు వచ్చాయి" అని రక్షణ మంత్రిత్వ శాఖ బెంగళూరు ప్రజా సంబంధాల అధికారి తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

36 వేల నుంచి 40 వేల అడుగుల ఎత్తున ఎగిరే ఈ విమానం సూపర్ సానిక్ వేగం నుంచి సబ్ సానిక్ వేగానికి చేరుకునే క్రమంలో ఇలా భారీగా శబ్దాలు వస్తుంటాయని వివరణ ఇచ్చారు. ఈ శబ్దం వచ్చినప్పుడు నగరానికి చాలా దూరంలో విమానం ఉందని, ఈ విమానం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, శబ్దాలు వినిపిస్తాయని పేర్కొన్నారు.

కాగా, ఈ శబ్దాలు బెంగళూరు విమానాశ్రయం నుంచి అక్కడికి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ వరకూ, ఆపై తూర్పు బెంగళూరులోని కల్యాణ్ నగర్, మధ్య బెంగళూరులోని ఎంజీ రోడ్డు, మారతహళ్ళి, వైట్ ఫీల్డ్, సర్జాపూర్ తదితర ప్రాంతాల్లోనూ వినిపించాయి. చాలా మంది ప్రజలు ఇది ఫైటర్ జెట్ శబ్దమని అంచనా వేయగా, సామాజిక మాధ్యమాల్లో దీని గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. భూకంపం వచ్చిందన్న వదంతులు రాగా, కర్ణాటక డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్, అటువంటిది ఏమీ లేదని వివరణ ఇచ్చింది.