Nori Dattatreyudu: మూడు, నాలుగు నెలల్లోనే వాక్సిన్ వస్తుంది: నోరి దత్తాత్రేయుడు

  • ప్రతి 80 ఏళ్లకూ ఓ మహమ్మారి వైరస్
  • వ్యాక్సిన్ కోసం పలు దేశాల్లో పరిశోధనలు
  • ప్రస్తుతానికి భౌతిక దూరమే మందు
  • అమెరికాలోని తెలుగు వైద్యులు నోరి దత్తాత్రేయుడు  
Corona Vaccine may Available in four Months

కరోనా వైరస్ ను అరికట్టేలా మూడు, నాలుగు నెలల్లో వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్టు అమెరికాలోని ప్రముఖ తెలుగు వైద్యులు నోరి దత్తాత్రేయుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం న్యూయార్క్ లోని ఎల్మ్ హర్ట్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్య నిపుణుడిగా పని చేస్తున్న ఆయన, ఓ తెలుగు దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

మానవ చరిత్రలో ప్రతి 70 నుంచి 80 ఏళ్లకు ఓ వైరస్ ప్రబలి, అంటురోగాలు వస్తూనే ఉంటాయని, ఆపై వాటికి వ్యాక్సిన్ ను కనిపెడుతుంటారని గుర్తు చేసిన ఆయన, ఈ కొవిడ్-19 వైరస్ అధిక దూకుడును ప్రదర్శిస్తోందని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నో దేశాల్లోని శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు పరిశోధనలు సాగిస్తున్నారని తెలిపారు. భారత్ వంటి దేశాలు న్యూయార్క్ అనుభవాలను గుణపాఠంగా తీసుకోవాలని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కన్నా, ప్రజల్లో పెరిగే అవగాహనతోనే వైరస్ వ్యాప్తిని అదుపులో ఉంచవచ్చని అన్నారు. తరచూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ, భౌతిక దూరం పాటించడమే ప్రస్తుతానికి కరోనాకు మందని అభిప్రాయపడ్డారు.

భారత ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం మంచిదేనని, ఇండియాలో కేసుల సంఖ్య లక్షల్లోకి చేరితే, వైద్య సదుపాయాలు అందించేందుకు సరిపడా ఆసుపత్రులు లేవని దత్తాత్రేయుడు అన్నారు. గ్రామీణ స్థాయిలో మరింతమందికి పరీక్షలు జరగాల్సి వుందని తెలిపారు. భారత ప్రభుత్వం అనుమతిస్తే, అమెరికాలో ఉన్న భారత సంతతి వైద్యులు తమవంతు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పొగతాగేవారు, మద్యం తాగే వారు, 70 ఏళ్లు పైబడిన వారు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం కరోనా రోగులకు రెమిడీసివిర్ ఔషధాన్ని ఇస్తున్నామని, ఇది సత్ఫలితాలను ఇస్తోందని, రెండు వారాల్లో కోలుకునే రోగులు, ఈ మందుతో వారం రోజులకే కోలుకుని ఇంటికి వెళుతున్నారని దత్తాత్రేయుడు వ్యాఖ్యానించారు. ఇక హైడ్రాక్సీ క్లోరోక్విన్ బిళ్లలు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయన్న విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని తెలిపారు.

More Telugu News