Corona Virus: తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి.. నేడు 27 కేసులు, రెండు మరణాలు నమోదు!

  • జీహెచ్ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు
  • 40కి చేరిన మరణాల సంఖ్య
  • ఇంకా యాక్టివ్‌గా  608  కేసులు
Corona cases in Telangana Raised to 1661

తెలంగాణలో నేడు 27 కరోనా కేసులు నమోదు కాగా, ఇద్దరు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులతో పోలిస్తే నేడు చాలా తక్కువ కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా, మిగతా 12 మంది వలస కార్మికులని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,661కి పెరిగింది. అలాగే, ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరింది. ఇక, కరోనా బారినపడిన వారిలో నేడు ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,013కి చేరింది.

రాష్ట్రంలో ఇంకా 608 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 89 మంది మహమ్మారి బారిన పడినట్టు పేర్కొన్నారు. గత రెండు వారాలుగా 25 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపిన అధికారులు.. వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వివరించారు. కాగా, తెలంగాణలో ప్రతి రోజూ వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో సగానికిపైగా జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
.

More Telugu News