గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ప్రారంభం కానున్న విమాన సర్వీసులు

20-05-2020 Wed 18:25
  • సోమవారం నుంచి ప్రారంభం కానున్న దేశీయ విమాన సర్వీసులు
  • ఎయిర్ పోర్టులను సిద్ధంగా ఉంచాలన్న కేంద్ర విమానయాన మంత్రి
  • ప్రయాణికులకు మార్గదర్శకాలను విడుదల చేస్తామన్న మంత్రి
Domestic Flights To Resume From Monday

విమాన ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. సోమవారం (25వ తేదీ) నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని విమానయాన మంత్రి హర్దీప్ పూరి ట్విట్టర్ ద్వారా తెలిపారు. విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, ఎయిర్ క్యారియర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. విమాన ప్రయాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను పౌర విమానయానశాఖ విడుదల చేస్తుందని చెప్పారు.

లాక్ డౌన్ సమయంలో కార్గో విమానాలు, వైద్యపరమైన అవసరం ఉన్న విమానాలు మాత్రమే తిరిగాయి. విదేశాలలో చిక్కుకుపోయిన వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. సాధారణ ప్రయాణికులకు మాత్రం సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు, రైలు, బస్సు సేవలు ప్రారంభం కావడంతో... విమాన సర్వీసులు కూడా ప్రారంభించాలని ప్రభుత్వానికి విన్నపాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమానాలు తిరిగేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.