నాగబాబూ... నీ తెలివితక్కువ తనంతో చిరంజీవి పరువు తీయొద్దు: ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి

20-05-2020 Wed 15:04
  • గాడ్సే నిజమైన దేశభక్తుడు అన్న నాగబాబు
  • వెల్లువెత్తుతున్న విమర్శలు
  • తప్పుగా అర్థం చేసుకోవద్దని మరో ట్వీట్ చేసిన నాగబాబు
Dont bring bad name to Chiranjeevi says Mastan Vali

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా సినీ నటుడు, మెగా బ్రదర్ నాగబాబు కొనియాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో నాగబాబుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మండిపడ్డారు. మీ తెలివితక్కువ తనంతో మీ అన్న చిరంజీవి పరువు తీయవద్దని అన్నారు.  

నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు ట్వీట్ చేస్తూ... నాథూరాం గాడ్సే వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని అన్నారు. ఆనాటి ప్రభుత్వానికి లోబడే అప్పటి మీడియా పని చేసిందని చెప్పారు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతామని తెలిసి కూడా... గాడ్సే అనుకున్నది చేశారని అన్నారు. పాపం నాథూరాం గాడ్సే అని కామెంట్ కూడా చేశారు.

అయితే, ఆ తర్వాత అనేక విమర్శలు రావడంతో... తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతూ మరో ట్వీట్ చేశారు. గాడ్సేని తాను సమర్థించలేదని... ఆయన వెర్షన్ కూడా ప్రజలకు తెలియాలని మాత్రమే అన్నానని చెప్పారు. గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు.