కర్నూలులో భగ్గుమన్న వర్గపోరు.. కర్రలతో దాడిచేసుకున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి, సిద్ధార్థరెడ్డి వర్గీయులు

20-05-2020 Wed 08:38
  • బీజేపీలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి
  • వైసీపీలో సిద్ధార్థరెడ్డి
  • స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వర్గపోరు
Byreddy Rajasekhar Reddy and Siddharth reddy groups fight in Kurnool

బాబాయ్, అబ్బాయిలైన బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాల మధ్య వర్గపోరు రాజుకుంది. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఇరు వర్గాలకు చెందిన వారు కర్రలు, రాళ్లతో చితక్కొట్టుకున్నారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి అనుచరులు ఇద్దరికి గాయాలు కాగా, సిద్ధార్థరెడ్డి అనుచరుడితోపాటు ఏఎస్సైకి గాయాలయ్యాయి.

ముచ్చుమర్రి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తి, అతడి సోదరుడిపై ప్రత్యర్థులు దాడికి దిగినట్టు తెలుస్తోంది. తమ ఇంటిపైకి గుంపులుగా వచ్చి దాడికి దిగారని బాధితులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు భారీగా మోహరించారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇటీవల మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజశేఖరరెడ్డి, సిద్ధార్థరెడ్డి వర్గీయుల మధ్య పగలు రగులుతున్నట్టు తెలుస్తోంది.