బస్సులు రోడ్డెక్కాయిగానీ... ప్రయాణికులే లేరు!

20-05-2020 Wed 07:00
  • మంగళవారం నుంచి ప్రజా రవాణా మొదలు
  • 35 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు
  • ప్రజలను వీడని కరోనా భయం
No Passengers for TSRTC buses

తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి ప్రజా రవాణా తిరిగి ప్రారంభం కాగా, ప్రయాణికులు లేక బస్సులు వెలవెలబోయాయి. కరోనా సోకవచ్చన్న భయంతో ప్రయాణాలకు ఎవరూ మొగ్గు చూపలేదు. రాష్ట్రవ్యాప్తంగా 56 రోజుల తరువాత, తొలిరోజు 51 శాతం బస్సులు రోడ్డెక్కగా, కేవలం 35 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. ఇక వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ శివార్లకు వచ్చే బస్సుల్లో ఓ మోస్తరు రద్దీ కనిపించగా, జిల్లాల పరిధిలో తిరిగే బస్సులను ఎక్కేవారే కరవయ్యారు. చాలా డిపోల నుంచి పల్లెలకు వెళ్లే బస్సులు బస్టాండ్లను కూడా దాటలేదు.

మామూలు రోజుల్లో అయితే, తెల్లవారుజామునే ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకుంటారు. కానీ, నిన్న మాత్రం ప్రయాణికుల కోసం ఆర్టీసీ సిబ్బంది ఎదురు చూడాల్సి వచ్చింది. ఆదిలాబాద్ నుంచి సూర్యాపేట వరకూ ఇదే పరిస్థితి. ఉదయం 8 గంటల ప్రాంతంలో బస్సులను ఎక్కేందుకు ప్రయాణికులు వచ్చినా, గ్రామాలకు వెళ్లేవారు మాత్రం కనిపించలేదు.

కాగా, మొత్తం 6,153 బస్సులను నడిపించేందుకు అధికారులు సిద్ధం కాగా, మంగళవారం నాడు 3,179 బస్సులు మాత్రమే తిరిగాయి. బస్సుల్లో నిలబడి చేసే ప్రయాణాలను ప్రభుత్వం నిషేధించగా, కూర్చుని ప్రయాణం చేసేందుకు కూడా ప్రజల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించలేదు.

ఇదే సమయంలో ఆటోలకు మాత్రం డిమాండ్ పెరిగింది. పది మందితో కలిసి బస్సెక్కే బదులు, విడిగా ఆటోలో ప్రయాణించేందుకే చాలా మంది మొగ్గు చూపారు. కరోనా గురించిన వార్తలు ఇన్ని రోజులూ వింటూ ఇళ్లలో ఉన్న ప్రజల్లో సాధారణంగానే భయం పెరుగుతుందని, ఇది తగ్గి మామూలు పరిస్థితి ఏర్పడేందుకు వారం రోజుల సమయం పడుతుందని మానసిక నిపుణులు వ్యాఖ్యానించారు.